RSS

మా ఇల్లు


మా ఇల్లు చాలా పెద్దది.అప్పటి లెక్క ప్రకారం 6 సెంట్లు వుండేది.ఇంటి ముందు, వెనుక ఖాళీ స్థలం,చుట్టూ ప్రహరీ పెద్ద గేటు,మధ్యలో ఇల్లు.మా అమ్మ ఇంటిని చాలా బాగా వుంచేది.ముందు వైపు బంతి,చామంతి ,కనకాంబరాలు,మడుల్లో పెంచేది.వెనకవైపు మునగ చెట్టు,గోరింట చెట్టు,చిక్కుడు,బీర,దొండ ,కాకర,సొర ఇలా రకరకాల పందిర్లు వేసి పండించేది.

పొట్ల పాదు తెల్లగా బారుగా కాయలు కాసేది.అవి ఇంకా బారు పెరగటానికి కాయకి కింద చివరన రాయి కట్టి వేలాడకట్టేది. పెరట్లో మంచినీళ్ళ బావి కూడా వుండేది.పెరట్లో తులసి చెట్టు కూడా వుండేది.మా అమ్మ బాగా పూజలు చేసేది..ఇంటి పనుల్లో మా రెండో అక్క మా అమ్మకి బాగా హెల్ప్ చేసేది.

మేము
గోరింటాకు పెట్టుకోవాలంటే అమ్మ మా చెట్టు గోరింటాకుని ఉదయాన్నే కోసి అందులో పెరుగు,రేగిచెట్టు కాసు వేసి నానబెట్టి వుంచేది.మధ్యానం మూడింటి నుంచి మా పద్దక్క,రెండో అక్క ఇద్దరు రోట్లో వేసి రుబ్బే వాళ్ళు...ఆకు రుబ్బుతుంటేనే ఇద్దరికీ కుడి చేతులు పండేవి.

ఇహ
సాయంత్రం తొందరగా అన్నం తినేసి, గోరింటాకును చేతులకి,కాళ్ళకి పెట్టుకోవటానికి పోటీ పడటం
ఒక
ప్రహసనం..పెద్దక్క రెండో అక్క వాళ్ళ చేతులకి వాళ్ళే పెట్టుకునే వాళ్ళు..
నాకు మా ఇద్దరు చెల్లెళ్లకి మా అమ్మ పెట్టి చేతులకు తెల్లటి గుడ్డలు కట్టేది.
ఇంకా ఉదయాన్నే పండిన చేతులను చూసుకుని నాకు బాగా పండిందంటే నాకు బాగా పండినదని
గొప్పలు చెప్పుకునే వాళ్లము..

మా పిల్లలు,మా అక్కయ్యల పిల్లలు కూడా కొన్నాళ్ళు మా చెట్టు గోరింటాకు పెట్టుకునే వాళ్ళు ,
తరవాత
ఇంట్లో గోరింటాకు చెట్టు ఉండకూడదని చెప్పటంతో మా అమ్మ చెట్టు కొట్టించేసింది.
ఇది మా పెరడు,మా గోరింటాకు విశేషాలు...

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

మావూరి తిరునాళ్ళ


శ్రీరామనవమి తర్వాత వచ్చే పౌర్ణమి రోజు మా వూరి చెన్నకేశవుని కళ్యాణం,తరువాత రధోత్సవం
మా
చిన్నప్పుడు రోజుకి స్కూల్ ఎగ్జామ్స్ అయిపోయి పిల్లలందరం ఇంట్లో వుండే వాళ్ళం.
మేము 5 గురం ఆడపిల్లలం ఒక్క అన్నయ్య.అన్నయ్య మా అందరికంటే పెద్దవాడు.

మేము రధం చూడాలంటే అమ్మ నా కన్నా చిన్న వాళ్ళయిన చెల్లెళ్ళ బాధ్యతను మా పెద్దక్కకి అప్పగించేది.
అమ్మ,నేను,మా రెండో అక్క ఒక జట్టు.మా రెండో అక్కను అందరు అమ్మ కూచి అనేవాళ్ళు.
మా అన్నయ్య ,నాన్న రధం లాగటానికి వెళ్ళేవాడు.మమ్మల్ని మా అమ్మ లక్ష్మీదేవి మిద్దెలు అనే డాబాలు ఎక్కించి రధం చూపించేది.
రధం రోజున ఇసుకవేస్తే రాలనంత జనంవచ్చేవాళ్ళు ,వీధులన్నీ మిటాయి అంగళ్లు ,బొమ్మల కొట్లతో నిండి ఉండేవి.
రధం రోజున చుట్టుపక్కల ఊర్ల నుండి మా చుట్టాలు,వాళ్ళ పిల్లలు కూడా వచ్చేవాళ్ళు..చాలా సందడిగా ఉండేవి తిరునాళ్ళ రోజులన్నీ..
పండగ మాట ఎలా వున్నా ఇంటికి వచ్చే చుట్టాలకి వండి పెట్టటం,మర్యాదలు చేయటం అంతా మా అమ్మ చాలా ఓపికగా చేసేది.రకరకాల పిండివంటలు వండేది.

రధం అయిపోయిన తర్వాత మమ్మల్ని అందరినీ గుడికి తీసుకెళ్ళి స్వామివారి దర్శనం చేయించి వచ్చేటప్పుడు ఎవరికి
ఇష్టమైన బొమ్మలు వాళ్లకి కొనిపించి తీసుకు వచ్చేవారు మా నాన్న.

తిరునాళ్ళ టైం లో ఒక రోజు చింతామణి నాటకం,ఒకరోజు మయసభ,ఒక రోజు హరికధ కాలక్షేపం జరిగేవి.
ఇవన్నీ చూడటానికి మా అమ్మ పక్కింటి పెద్దవాళ్ళతో వెళ్లి వచ్చేది.

ఇలా ప్రతిసంవత్సరం వచ్చే తిరునాళ్ళ మాకు చాలా సందడిగా,సంతోషంగా గడిచిపోయేది..మళ్ళీ వచ్చే తిరునాళ్ళ కోసం ఎదురు చూస్తూ వుండేవాళ్ళము..


  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

ఉగాది...నా పుట్టినరోజు...


ఉగాది చాలా సందడిగా సంతోషంగా చేసుకున్నాము.పిల్లలు,నేను అందరం ఉదయాన్నే పూజ చేసుకుని ఉగాది పచ్చడి తిన్నాము.మా వారు ఉదయాన్నే శివాలయానికి వెళ్లి నా పేరు మీద పూజ చేయించి వచ్చారు. ఎందుకంటే రోజు నా పుట్టినరోజు కూడా మరి.
నేను ఉగాది రోజే పుట్టానట..అందుకని మా అమ్మ ప్రతి సంవత్సరం వుగాదిరోజే నా పుట్టినరోజు చేసేది..అలాగే నాకు పెళ్లి అయ్యి,పిల్లలు పుట్టిన తర్వాత కూడా నా పుట్టినరోజున వచ్చి హడావుడి చేసేది...

ఉదయాన్నే
పిల్లలు,మావారు నాకు చెప్పిన పుట్టిన రోజు శుభాకాంక్షలతో కొత్త సంవత్సరం మొదలయింది..మా ఇంటికి సంవత్సరం వచ్చిన కొత్త సభ్యులు మా చిన్న అల్లుడు, నా మనుమరాలు
ప్రతి
ఉగాది నాడు మా ఇంట్లో రెండు పండుగలు..ఒకటి తెలుగు నూతన సంవత్సరం,రెండు నా పుట్టిన రోజు.. సాయంత్రం మా పిల్లలు,మావారు,మా అక్కయ్య పిల్లలు అందరి మధ్య కేకు కట్టింగ్ చేశాను.. మా ఇంట్లో ఖర నామ సంవత్సర ఉగాది చాలా సంతోషంగా మొదలైంది..

అందరికి ఖర నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు..


  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

నా జీవనగమనంలో

నా ఇన్నేళ్ళ జీవనగమనాన్ని వెనుతిరిగి చూసుకుంటే...
ఎన్నో మజిలీలు..మరెన్నో గమ్యాలు
ఎన్నో అనుభవాలు..మరెన్నో అనుభూతులు
నాగురించి నేను చెప్పుకునేంత గొప్పదాన్ని కాకపోయినా నా జీవితంలో జరిగిన సంఘటనలు,అనుభవాలను ఆత్మావలోకనం చేసుకుని నా మనసులోని మధురానుభూతులను పదిలంగా భద్రపరచుకునే ప్రయత్నమే..
నా జీవనగమనంలో ...ఇదే నా మొదటి అడుగు..

తెలుగులో బ్లాగ్ వ్రాయాలన్న నా ప్రయత్నం ఇన్నాళ్ళకు నెరవేరినందుకు చాలా సంతోషంగా వుంది.
నా ప్రయత్నానికి సహకరించి ,నాకు కంప్యూటర్, బ్లాగింగ్ నేర్పించిన నా పిల్లలకి థాంక్స్ చెప్తూ...
నా జీవనగమనాన్ని ప్రారంభిస్తున్నాను...



  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...