RSS

ఎవరు రాయగలరూ ... అమ్మ అను మాట కన్న ...


ఎవరు రాయగలరూ అమ్మా అను మాట కన్నా తీయని కావ్యం
ఎవరు పాడగలరు అమ్మా అను రాగం కన్నా కమ్మని రాగం


" నీకంటూ ఒక అస్తిత్వం లేనప్పుడు కూడా నిన్ను కోరుకుంది
నువ్వెలా ఉంటావో తెలియకపోయినా ప్రేమించింది
నువ్వు కనిపించటానికి గంట ముందు నుండీ
నీ కోసం ప్రాణాలర్పించటానికి సిద్ధపడింది"

జీవితాన్ని వరంగా ఇచ్చిన అమ్మకు ఏ బహుమతి ఇచ్చినా తక్కువే
చిన్నప్పుడు చలికి వణికి పోతుంటే వెచ్చటి దుప్పటి కప్పి కాపాడింది.
పెద్దయ్యాక సమస్యలతో సతమతమైతే తన ప్రార్ధనలతో
కాపాడుకుంది అమ్మ.

అమ్మకి ప్రపంచమే తెలియదనుకుంటాము ఆమె ప్రపంచాన్ని
వదిలి వెళ్ళాక కానీ అర్ధం కాదు "అమ్మ గొప్ప తత్వవేత్త" అని

అమ్మ
ఏ విషయమైనా రెండుసార్లు ఆలోచిస్తుంది
ఒక సారి తన వైపు నుండి,ఇంకోసారి బిడ్డ వైపు నుంచి..
అమ్మ ముద్దుల వెనకే కాదు దెబ్బల వెనకా అపారమైన ప్రేమే వుంటుంది.

అమ్మగా,అమ్మమ్మగా,నానమ్మగా పిల్లలని ప్రేమానురాగాలతో తీర్చిదిద్దుతూ,
వాళ్ళ ప్రేమాభిమానాలను కోరుకునే మాతృ మూర్తులందరికీ

మాతృ
దినోత్సవ శుభాకాంక్షలు




  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

మా చిన్ననాటి వేసవి ...

వేసవి వస్తూనే తన ప్రతాపం చూపిస్తూ వచ్చినా మధ్య కురిసిన వర్షాల వలన వాతావరణం కొంచెం చల్లబడింది.
పిల్లలకి సెలవలు వచ్చేసాయి..ఎక్కడ చూసినా వేసవి ప్రయాణాలు,హడావుడి కనిపిస్తుంది.మా పక్కింటి పద్మా గారింట్లో అమ్మమ్మ గారింటికి వెళ్ళే హడావిడి మొదలు అయ్యింది . మా పిల్లలు పెద్దవాళ్ళు అవటంచేత మా ఇంట్లో హడావిడి లేదు ఇంకా.మా పిల్లల చిన్నతనం లో సెలవలు చాల ఆనందంగా గడిసేవి.మాచెల్లి, పిల్లలు నర్సాపురం నుంచి వేసవి సెలవలకి మా ఇంటికే వచ్చే వాళ్ళు. మాపిల్లలు,అందరితో బాగా కలసిపోయేవాళ్ళు.. వాళ్ళతో కలిసి ఎండల్లోనే ఆటలు, షికార్లు, వేసవి స్పెషల్ మామిడి కాయలు,అప్పట్లో వచ్చే పుల్ల ఐస్ లు తింటూ.. కాసేపు కొట్టుకుంటూ,తిట్టుకుంటూ, అంతలోనే మళ్ళీ కలిసిపోతూ ఇలా మే నెల అంతా మా అందరి ఇళ్ళూ చాలా సందడిగా ఉండేవి.


మా చిన్న తనంలో ఐతే మేము ఐదుగురు అక్కా చెల్లెళ్ళం ,అన్నయ్య ఎవరు ఎక్కడికి వెళ్ళాలి అని చీటీలు వేసే వాళ్ళము.. ఎక్కువగా నేను మా పెదనాన్న గారి దగ్గరికి వెళ్ళేదాన్ని. అక్కడినుంచి మా పెద్ద అన్నయ్య దగ్గరికి ,మా పెద్దనాన్న పిల్లలే అయినా అక్క,అన్నయ్యలు నన్ను సొంత చెల్లి లాగా ప్రేమగా చూసేవాళ్ళు. సెలవలన్నీ అక్కడనే గడిపేదాన్ని..పెద్దక్క,బావతో కలిసి సినిమాలు చూడటం,దగ్గరలో వున్న ప్రదేశాలు చూసి రావటం ఒక నెల వేసవి సెలవలు తెలియకుండానే అయిపోయేవి..

ఒకసారి వేసవి సెలవలకి పెద్దమ్మ అంటే అమ్మ వాళ్ళ అక్క గారి
ఊరు వెళ్ళాము.. ఉరు వెళ్ళటం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే అది ఒక చిన్న పల్లెటూరు. అక్కడికి వెళ్ళటానికి సరైన రవాణా మార్గం కూడా వుండేది కాదు. కొంత దూరం బస్సు ప్రయాణం , తరువాత ఎద్దుల బండి మీద వెళ్ళాలి.. చాలా మంది కాలి నడకన ఉరు వెళతారు. అనుకున్నట్లు గానే ప్రయాణం రోజు వచ్చింది.. ముందు రోజున అమ్మ మా అందరి బాగ్స్ సర్ది పెట్టినది. నేను నిద్ర లేచే సరికి మా ఇంటి ముందు బాగా అలంకరించిన ఎద్దులతో ఉన్న బండి ఆపి ఉన్నది. దానిని చూడ గానే అన్నయ్య ,మా పెద్దక్క ,మూడో చెల్లి చాలా ఆనందంగా ప్రయానికి సిద్ధమయ్యారు.. అందరం హుషారుగా రెడీ అయిపోయి..అమ్మ,నాన్నచెప్పే జాగ్రత్తలతో బండి చాల హుషారుగా కదిలినది. దారి పొడుగునా పచ్చటి చెట్లు, తాటిముంజల కాయలతో నిండిన తాటి చెట్లు, బండి నడిపే అబ్బాయి కూనిరాగాలు ఉదయాన్నే ప్రయాణం కావటంతో వాతావరణం చాలచాల్లగా హాయిగా ఉంది. మాకు ఎద్దుల బండి ప్రయాణం చాలా సరదాగా ఉండేది.మేము మా అన్నయ్య తో ఎద్దులని ఇంకా స్పీడ్ గా పరిగెట్టించమంటే మా అన్నయ్య (పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి) ఒద్దు అవి పందెపు ఎద్దులు ,అట్లా రెచ్చగొడితే ప్రమాదం అని చెప్పాడు.


అలా
మా ప్రయాణం సాగి తొందరగానే ఇల్లు చేరాము.. ఇంటి ముందు ఆగగానే పెద్దమ్మ కూతుర్లు , పక్కింటి వాళ్ళు వచ్చి టౌన్ నుంచి వచ్చిన పిల్లలం కాబట్టి అందరూ ఆసక్తిగా చూస్తూ.మమ్మలిని ఆప్యాయంగా పలకరిస్తూ ఇంట్లోకి తీసుకెళ్ళారు. మా పెద్దమ్మ వాళ్ళ ఇళ్ళు చాలా పెద్దవి.. ఇంట్లోనే పెద్ద పెద్ద ధాన్యపు గాదెలు ఉండేవి.వాటి నిండా ధాన్యాన్ని నిల్వ చేసేవారు.ఇంట్లో ఆవులు,ఎద్దులు,గేదలు ఇలా పశు సంపద అంతా వుండేది... వీటన్నిటి కోసం పెద్ద పశువుల కొష్టాలు ఉండేవి వాటి కోసం ప్రత్యేకంగా జీతగాళ్ళు వుంటారు.వీళ్ళకి జీతాలు కూడా ఆరోజుల్లో చాలా తక్కువగా ఉండేవి.
సంవత్సరానికి ఒకసారి జీతాలు,బట్టలు పెట్టేవాళ్ళు. కానీ రోజూ మాత్రం మా పెద్దమ్మ ఇంట్లోనే జీతగాళ్ళకి చల్లని మజ్జిగతో అన్నం పెట్టేది.ఇలా మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లంతా ఇంట్లో మనుషులు,పశువులు,వచ్చే పోయే బంధువుల తో
ఎప్పుడూ చాలా హడావుడిగా ఉండేది..

మేము ఇంటికి వెళ్ళగానే భోజనాల కార్యక్రమం.
. మా పెద్దమ్మ మమ్మల్ని అందరినీ భోజనం కోసమే కేటాయించిన పడమటి ఇంట్లో కూర్చో పెట్టి,మా అందరికీ వడ్డించింది.భోజనం లో వాళ్ళ మోట బావి కింద చేలో పండించిన వడ్ల బియ్యం అన్నం,ముద్ద పప్పు,ఇంట్లో అప్పుడే కొత్తగా పెట్టిన రకరకాల పచ్చళ్ళు( నాకు ఇష్టమైన కొత్త మామిడి కాయ పచ్చడి)
ఇంట్లో గేదె పాల తో వచ్చిన మీగడతో ఇంట్లోనే తయారు చేసిన నెయ్యి వేసి ,చివరిలో గడ్డపెరుగుతో మళ్ళీ మళ్ళీ వడ్డిస్తూ మా భోజనం పూర్తయ్యింది..

మరుసటి రోజు తెల్లవారగానే అందరు తొందరగా రెడీ ఐతే మీ అందరిని తాటి తోపుకి తీసుకెళతాను అని మాపెద్దమ్మ కొడుకు చెప్పాడు.. మేము నలుగురం, మా పెద్దమ్మ కూతుర్లు,పెద్దన్నయ్య అందరం కలిసి వెళ్ళాము.. చాలాపెద్ద తోట అది అందులోనే సగం మామిడి తోట,సగం తాటి తోపు..ఇందులోనే ఇంటికి అవసరమైన కూరగాయలు కూడా పండించే వాళ్ళు. తాటి తోపు లోకి వెళ్లి అన్నయ్య తాటి ముంజలు కొట్టించి ఇచ్చాడు. అప్పటికప్పుడు చెట్టు మీద నుంచి కొట్టినవి కావటం తో తాటి ముంజలు చాల లేతగా తియ్యగా,అందులో చల్లటి నీళ్ళతో చాలా బాగుండేవి..
మాతోట వెంబడే చంద్రవంక అని ఒక వాగు పారుతుండేది. అందులో మా అన్నయ్య లు ఇద్దరు ఈత కొట్టేవాళ్ళు..

మాతో పాటూ వచ్చిన జీతగాళ్ళు తాటి మట్టలు, ముంజలు తీసిన తాటి కాయలతో గాన్లు లాగా బండి తయారుచేసి మమ్మలిని బండి మీద ఎక్కించుకుని లాగే వాళ్ళు. అలా సాయంత్రం దాకా ఎండా కూడా తెలియకుండా తోటల్లో ఆడుకుని,ఇంటికొచ్చేటప్పుడు కావాల్సినన్ని తాటిముంజలు, మామిడి కాయలు కోసుకొచ్చుకున్నాము..ఇలా మా సెలవలన్నీ అక్కడ చాలా సరదాగా,సంతోషంగా గడిపి మేము ఇంటికి వచ్చేదాకా మా పెద్దమ్మ పిల్లలు,పెద్దన్నయ్య మమ్మల్ని చాలా ఆప్యాయంగా చూసుకునే వాళ్ళు. ఇప్పుడు ఒక్క బయటి మనిషి భోజనానికి వస్తేనే ఎంతో ఇబ్బంది పడుతుంటారు.. కానీ రోజుల్లో ఇంట్లో ఎంతమంది ఉన్నా,ఎంతమంది బయటి వాళ్ళు వచ్చినా విసుగు లేకుండా పెద్ద పెద్ద పాత్రల్లో వండి వడ్డించే అప్పటి వాళ్ళ ఆప్యాయత ఇప్పుడు లేదు,రాదు కూడా!!


మేము ఇంటికి వచ్చేటప్పుడు మాకు చాలా తాటిముంజలు,మామిడికాయలు,వేరుశనగకాయలు ఇచ్చి పంపేవారు.మరల మమ్మలిని అదే బండిలో ఇంటికి పంపించారు. అక్కడ గడిపిన మా సెలవలన్నీ మాకు మరిచిపోలేనంత సంతోషాన్ని కలిగించాయి..అప్పుడు అనిపించింది నాకు మా అన్నయ్య ,అక్కలు సెలవలకు అక్కడికి ఎందుకు వెళదామంటారో !!. నిజంగా అప్పుడు తిరిగిన తోటలు,చేలు,చెరువు గట్లూ, ఆప్యాయతలు జన్మలో మరచిపోలేము. రోజులు మరల రావు.. అందుకే వాటిని గుర్తు చేసుకోవటం .. అదొక ఆనందం.

ఇప్పటి రోజుల్లో పిల్లలకి ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు దూరమయ్యాయి..చదువులు,ఎగ్జామ్స్,అవి అయిపోగానే పోటీ పరీక్షలు,కొద్ది టైం వుంటే కంప్యూటర్ వీడియో గేమ్స్ ఇవే ప్రస్తుతం పిల్లల వేసవి సరదాలు..మారుతున్న కాలాన్ని బట్టి అన్నీ మారాయి.. అలాగే వేసవి సరదాలు కూడా...

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

శ్రీరామ నవమి శుభాకాంక్షలు


పట్టాభిరామునికి ప్రియవందనం
పాప విదూరునికి జయవందనం
అయోధ్య రామునికి అభివందనం
అందాల దేవునికి మదే మందిరం


శ్రీరామచంద్రమూర్తి కరుణా కటాక్షములు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ...
అందరికీ శ్రీ రామనవమి శుభాకాంక్షలు.


  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

పాపిట సింగారం.. పాపిట బిళ్ళ


ఆడపిల్లలను ఎంత అలంకరించినా ఇంకా ఏదో ఒక లోటు కనిపిస్తూనే
ఉంటుంది
.చెవులకు జూకాలు,చేతికి గాజులు,మెడలో హారం,ముక్కుకి పుడక,
(ఇది ఇప్పుడు అంతగా ఎవరూ వాడటం లేదనుకోండి).ఇన్ని ఆభరణాలను అలకరించుకున్నా ఏదో వెలితి అనిపించింది బంగారు బొమ్మకి.వెంటనే బొట్టుతో ఎంతో కళగా మెరిసిపోతున్న నుదిటి మీదకు పాపిట బిళ్ళ వచ్చి చేరగానే ...వావ్! నిజంగా బంగారు బొమ్మలానే ఉన్నానంటూ తన అందానికి తానే మురిసిపోయింది మా బంగారు బొమ్మ.


చీరలు,లంగా వోణీలు,చుడీదార్ లు ఏ డ్రెస్ అయినా పాపిట బిళ్ళ పెట్టుకుంటే చాలు అమ్మాయిలు సంప్రదాయంతోకూడిన అందంతో మెరిసిపోతుంటారు.అందుకే ఈ తరం అమ్మాయిలు కూడా పాపిట బిళ్ళను తమ ఫ్యాషన్ కలెక్షన్ లో భాగం చేసుకున్నారు...పెళ్ళిళ్ళు,సంప్రదాయ వేడుకల్లో పాపిట బిళ్ళ తప్పకుండా అలంకరించుకుంటున్నారు.
అందుకే ఒకప్పటి సాదా సీదా గా వుండే పాపిట బిళ్ళ ఇప్పటి పిల్లల ఫ్యాషన్ లకు అనుగుణంగా నవరత్నాలు,రంగు రంగుల క్రిష్టల్స్ ,రాళ్ళు,ముత్యాలు తో ఇలా రకరకాల వెరైటీ పాపిట బిళ్ళలు
అందంగా తళుకు లీనుతూ ఆకట్టుకుంటున్నాయి..


పాపిట బిళ్ళ అనేది రాజస్తానీ మహిళలకు తప్పని సరి అలంకారం.సాంప్రదాయ రాజస్థానీ "మాంగ్ టిక్కా" (పాపిట బిళ్ళ)వెడల్పు బిళ్ళలా కాకుండా గుండ్రని గంట లాగా ఉంటుంది..ముస్లిం లు కూడా పెళ్ళిళ్ళ లో పాపిట సింగారమైన ఈ పాపిట బిళ్ళను తప్పసరిగా అలంకరించుకుంటారు.

మా చిన్నప్పుడు నాకు,మా అక్కయ్యలందరికీ మా అమ్మ పాపిట బిళ్ళతో పాటూ సూర్య చంద్రులు బిళ్ళలు, పాపిట కి రెండుపక్కలా పెట్టేది.పొడవైన నల్లటి జడలో పాపిట మధ్యలో ఈ పాపట బిళ్ళ,
రెండు పక్కలా సూర్య ,చంద్రులు,జడలో చామంతి బిళ్ళ పెట్టుకుని,జడ కుప్పెలతో జడ వేసుకునే వాళ్లము.


ఈ సాంప్రదాయ అలంకారాలన్నీ ఒకప్పుడు మొరటు అని అన్నా ఈ మధ్య కాలం లో అమ్మాయిలు
లంగా
వోణీ సాంప్రదాయం తో పాటూ ఈ అలంకరణలన్నిటినీ "టెంపుల్ జ్వేల్లరీ" పేరుతో అలంకరించుకోవటానికి ఆసక్తి చూపించటం ఆహ్వానించదగిన పరిణామంగా చెప్పొచ్చు..


ఆయుర్వేద
శాస్త్ర రీత్యా కూడా నుదుటున పాపిట బిళ్ళను అలంకరించుకోవటం వలన
నుదురు దగ్గర నాడులు ఉత్తేజితమవుతాయట .
అందుకే మరి .... పాపిట సింగారం .... మగువల మనసైన అలంకారం...

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

"నను వెలిగించిన వనిత"


నింగీ నేల మాదే అంటూ అన్ని రంగాలలో తనదైన ముద్ర వేస్తూ,తమ ప్రతిభను చాటుకుంటున్న
మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.

ఈ మహిళా దినోత్సవాన్ని అందరూ చాలా బాగా జరుపుకున్నారు,
అందరూ ఎవరికీ తోచినట్లు వాళ్ళు శుభాకాంక్షలు అందించుకున్నారు.
అలాగే వాళ్ళ జీవితాల్లో ముఖ్యమైన మహిళలకు కృతఙ్ఞతలు తెలియచేసుకున్నారు.

ఇందులో భాగంగానే "వనితా టీ.వీ" వాళ్ళు నిర్వహించిన ఒక కార్యక్రమం

"నను వెలిగించిన వనిత"
ఈ కార్యక్రమం గత 3 రోజులుగా వనితా టీవీలో వస్తుంది..
ఎవరైనా సరే యాంకర్ కి ఫోన్ చేసి తమ జీవితంలో వాళ్ళ ఉన్నతికి కారణమైన మహిళలు ఎవరైనా
వాళ్ళు అమ్మైనా కావచ్చు,భార్య కావచ్చు ఇలా మీ జీవితం లో మిమ్మల్ని వెలిగించిన వనిత ఎవరో
మీ అనుభవాలను మాతో పంచుకోండి అని అడిగారు..
కొంత మంది ఫోన్ చేసి వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దిన మహిళలకి కృతఙ్ఞతలు తెలియచేశారు.

ఈ ప్రోగ్రాం లో చాలా మంది జీవితాన్ని వెలిగించిన వనిత గురించి మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో
ఎందరో వివిధ రంగాలలో ఉన్నత స్థానం లో ఉన్నవాళ్ళు,సామాన్యులు, స్పందించి వాళ్ళను
వెలిగించిన వనితను గురించి లోకానికి తెలియచేసి,వాళ్లకి కృతఙ్ఞతలు తెలియచేశారు.
ఇందులో మగవాళ్ళే కాదు ఆడవాళ్ళు కూడా ఫోన్ చేసి వాళ్ళ ఉన్నతికి కారణమైన మహిళలకు
కృతజ్ఞతలను తెలియ చేసి,మహిళా దినోత్సవ శుభాకాంక్షలను అందించారు...

నేను కూడా నా జీవితంలో సంసారాన్ని చక్కదిద్దుకోవటం,పిల్లల పెంపకం వాళ్ళ జీవితాలను తీర్చిదిద్దటం
ఇవన్నీ నేర్పిన మా అమ్మకి నేను కూడా ఈ మహిళా దినోత్సవం సందర్భంగా కృతఙ్ఞతలు
తెలియ చేస్తున్నాను.

ఈ విషయాలన్నీ మీ అందరితో పంచుకునేలా నాకు బ్లాగ్ గురించి తెలియచేసి,ఎలా రాయాలి,
మనసులో ఉన్న అభిప్రాయాలని తెలియ చెయ్యటం ఎలా అని,నేను చేసే వంటలు నచ్చి,
ఆ వంటలకు కూడా ఒక బ్లాగ్ క్రియేట్ చేసి,నా జ్ఞాపకాలను,అనుభూతులను పదిలపరచుకునే
ఒక వేదికగా ఈ బ్లాగ్ లు రాయటానికి అన్ని విధాలా సహకరిస్తున్న నా అమ్ములుకి
మహిళా దినోత్సవం సందర్భంగా నా ప్రత్యేక శుభాకాంక్షలు.

ప్రతి మనిషి విజయం వెనుక ఒకరు తప్పకుండ ఉన్నట్లు
"నా జీవనగమనంలో"
పోత్సహిస్తూ నన్ను వెలిగించిన వనిత
నా "అమ్ములు" I Love You.


Happy Women's Day


  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

మట్టి గాజులు.


నిన్న మా పిల్లలు ఇద్దరు బజారు కెళ్ళి వాళ్లకు ఇష్టమైన గాజులు,ఇంకా వాళ్లకి అవసరమైన క్రీమ్స్ ఇంకా ఏవేవో తెచ్చుకున్నారు. వాటిని అన్ని టేబుల్ మీద పరుచుకుని ఎవరెవరు ఏమి తెచ్చుకున్నారో నాకు చూపిస్తూ మాట్లాడు కుంటున్నారు. నా చిన్నతనంలో గాజులు వేయించుకోవటం ఒక పెద్ద యుద్ధమే .నేను,మా పెద్దక్క అమ్మ గాజులు వేయించుకోమంటే వే వేయించుకొనే వాళ్ళం.మా రెండో అక్క మాత్రం గాజుల మూట మొత్తం చూపించినా గాజులు నచ్చేది కాదు. చాలాసేపు వెతికించేది.మా ఇద్దరు చెల్లెళ్ళు మాత్రం సెలెక్షన్ తొందరగానే చేసేవాళ్ళు.

మేము చిన్నపుడు గాజులు ఒక తెల్లటి గుడ్డలో మూట కట్టి దాన్ని భుజానికి రెండు వేపుల తగిలించుకుని,గాజుల వీరయ్య వచ్చే వాడు అతని కేక వినగానే
వీధిలోని పిల్లలు అతని వెంట కేకలు వేస్తూ బయలు దేరేవాళ్ళు.. గాజుల వీరయ్య రాగానే ఇంటిల్లపాది,వీధి ,వీధీ సందడి మొదలుతుంది.చిన్న పిల్లలు మొదలు కొని పండు ముత్తైదువుల వరకు అతని చుట్టూ చేరి తమకుసరి పోయే సైజు ,నచ్చిన రంగు వెతుక్కుంటూ చాల సందడిగా వండేది .అతని చేతులతోనే గాజులు వేయించుకుని అతనికి ,గాజుల మలారం కు నమస్కరించి అక్కడి నుంచి లేచేవాళ్ళు.. అది అప్పటిలో ఒక సాంప్రదాయం.

మహిళలు ధరిస్తున్న గాజులు వాటి ప్రాముఖ్యాన్ని ,ఆదరాన్ని కోల్పోలేదు సరి కదా వాటిలో అనేక కొత్త కొత్తరూపాలు,రంగులూ వచ్చాయి . మన జీవితంలో పెళ్లి కి ఉన్న ప్రాముఖ్యత ఎంతో గాజులకి కూడా అంత
ప్రాముఖ్యత ఉన్నది .పెళ్లినాటి ఉదయం గాజులు తొడిగే కార్యక్రమం ఉంటుంది. .చేతులకు గాజులు తొడిగే సరైన సమయాన్ని పూజారి నిర్ణయిస్తారు..దీన్ని చాలా పవిత్రమైనదిగా భావిస్తాము.

పెళ్ళిలో
నిండుగా గోరింటాకు పెట్టుకుని ముఖ్యంగా పెళ్ళిలో ఉపయోగించే ఎరుపు,ఆకుపచ్చ రంగుల గాజులతో మెరిసి పోయే వధువు చేతి గాజుల గలగలలు,పెళ్లి మంత్రాలు ,సన్నాయి మేళాలు కలగలసి వాతావరణము చాలా బాగుంటుంది.ఎన్ని బంగారు గాజులు వేసుకున్నా వాటి మధ్యలో కొన్నైనా మట్టి గాజులు వేసుకోవటం
ముత్తైదువులకు సౌభాగ్యాన్ని,అందాన్ని ఇస్తుంది.


  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

అత్తామామలు వద్దంట...!


రోజు మధ్యాహ్నం నేను టీవీ పెట్టే సరికి "వనితా చానెల్"లో రచయిత్రి శైలజా అనే ఆవిడ, ఇంకొక వ్యక్తి అతని వివరాలు నాకు తెలియలేదు.వీళ్ళిద్దరితో "అత్తామామలు వద్దంట" అనే విషయం గురించి లైవ్ షో లో యాంకర్ మాట్లాడుతుంది.
వాళ్ళ చర్చలో ముఖ్యమైన విషయం ఏంటంటే "పెళ్లి ఐన తర్వాత కొడుకుని కానీ కూతుర్ని కానీ తల్లిదండ్రులు ఏమీ ఆశించకూడదు.వాళ్ళని వాళ్ళ స్వేచ్చకు వదిలేసి వెళ్లి వృద్దాస్రమాల్లో వుండాలి.కని పెంచాము కాబట్టి ముసలితనంలో మమ్మల్ని పట్టించుకోవటం లేదు అని పిల్లల్ని విసిగించకూడదు" ...అని ఇద్దరు వక్తలు మాట్లాడారు.

వీళ్ళిద్దరినీ యాంకర్ ఒక ప్రశ్న అడిగారు ఏమని అంటే ...
మరి తల్లి దండ్రులు పిల్లల్ని కష్టపడి,ఆస్తులు అమ్ముకునైనా చదివిస్తారు,పెళ్ళిళ్ళు చేస్తారు కదా ?
చివరి రోజుల్లో వాళ్ళని పిల్లలు కాకపొతే ఎవరు చూసుకుంటారు అని.
అప్పుడు ప్రోగ్రాం లో మాట్లాడుతున్న వక్తల సమాధానం "వాళ్లకి ఎంతో కొంత ఇచ్చి వృద్దాశ్రామాల్లో
పెట్టాలి అంతే కానీ పిల్లలతో ఉంటాము అనకూడదు."

ఫారెన్ లో పిల్లల్ని ఎడ్యుకేషన్ లోన్ తో చదివిస్తారు ఇక్కడ కూడా అలాగే చేయాలి
అప్పుడు అప్పు పిల్లలే తీర్చుకుంటారు అని మాట్లాడారు.
సరే అలా చూసుకున్నా ఎడ్యుకేషన్ లోన్ ఇప్పించాలంటే తల్లి కానీ తండ్రి కానీ చేయాల్సిన పనే కదా..
వాళ్ళ హామీ లేనిది పిల్లలకి లోన్ ఇస్తారా?? విధంగా నైనా తల్లిదండ్రులు కష్టపడుతున్నారు కదా?

జీవిత కాలం కలిసి ఉంటానని,కష్ట సుఖాల్లో బాధ్యత తీసుకుంటానని పెళ్లి నాడు ప్రమాణం చేసాడు
కాబట్టి నా భర్త నా సొంతం అని ఆడపిల్ల అనుకున్నట్లే,నవమాసాలు మోసి కని,కష్టపడి పెంచాను
కాబట్టి నా కొడుకు నా కష్ట సమయంలో నాకు తోడుండాలి,అతని ఆనందంలో నేను పాలుపంచుకోవాలి
అని తల్లిదండ్రులు కోరుకోకూడదా ??
పెళ్లి అయ్యి ఇంట్లో అడుగుపెట్టగానే ఇల్లంతా నాది,మీరంతా థర్డ్ పర్సన్స్ అని అత్తల్ని,ఆడపడుచులని
అవమానించటం కోడలికి భావ్యమా??

కార్యక్రమంలో రచయిత్రి శైలజ గారు ఎంతప్పటికీ అమెరికాలో సెటిల్ అయిన,ఉన్నత కుటుంబాలకు చెందిన వ్యక్తుల గురించే మాట్లాడారు.. కానీ మిడిల్ క్లాస్ వ్యక్తుల గురించి కూడా ఆలోచించాలి.
పిల్లల మీద ఆధార పడకుండా వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళున్న తల్లిదండ్రులు వృద్ధాప్యంలో పిల్లల అండ లేకపోయినాబ్రతకగలరు.. కానీ పిల్లల కోసం,వాళ్లకి మంచి జీవితాన్ని ఇవ్వటం కోసం సమస్తాన్నిధారపోసి వాళ్ళకంటూ ఏమీ లేకుండా,చివరికి పిల్లలే ఆధారం గా వుంటారులే అని వాళ్ళనే నమ్ముకున్న తల్లిదండ్రులు ఏమి కావాలి??

నా కొడుకు అమెరికాలో ఉన్నాడు అని గొప్పలు చెప్పుకుంటూనే తల్లిదండ్రులు పిల్లలు
మమ్మల్ని
పట్టించుకోవటం లేదు అని తల్లిదండ్రులు మనసులో తిట్టుకుంటారు అలా తిట్టుకోకూడదు
అని
రచయిత్రి శైలజ అన్నారు..

మరి నిజమే కదా కొడుకు ఎంత గొప్ప స్తాయిలో వున్నా, తల్లి మనసుకు సంతోషాన్ని కలిగించాలన్న
విషయం కొడుకులు,కూతుర్లు మర్చిపోకూడదు.అలాగే తల్లి ఒకవేళ ఎప్పుడైనా కోపంతో ఒక్క మాట
పిల్లల్ని అన్నా మరుక్షణమే తన బిడ్డల్ని అలా అన్నందుకు తనే ఎంతో బాధపడుతుంది..

ముసలితనంలో తల్లిదండ్రులు కోరుకునేది ఆస్తిపాస్తులు,అధికారాలు కాదు..
కేవలం పిల్లలు పెట్టే తిండి కోసం వాళ్ళు బ్రతకరు.
పిల్లల నుండి పెద్దలు ఆశించేది ప్రేమతో కూడిన ఒక పలకరింపు, వయసులో వాళ్ళ మాటకు విలువ ఇచ్చి
వాళ్ళని గౌరవిస్తున్నామన్న ఒక ఆప్యాయతను తల్లిదండ్రులు కోరుకుంటారు.

ఉద్యోగాలు వచ్చి వేరే ప్రదేశాలకి వెళ్ళే పిల్లలు తల్లిదండ్రులను వెంట తీసుకెళ్ళాల్సిన అవసరం లేదు.
వాళ్లకి అనుకూలంగా ఉన్న చోటనే వాళ్ళ జీవనోపాధికి మార్గాన్ని ఏర్పాటు చేయొచ్చు, వాళ్లకు వీలైనప్పుడు
వచ్చి తల్లిదండ్రులను చూడొచ్చు కదా??

పిల్లల్ని
కని, పెంచటం ,చదివించటం తల్లి దండ్రుల బాధ్యత అన్నారు నిజమే..
మరి వాళ్ళ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి తల్లిదండ్రులను వృద్ధాప్యంలో కాపాడాల్సిన బాధ్యత
పిల్లలకి లేదా??

వృ
ద్దాశ్రామాల్లో వుండే వాళ్ళంతా తప్పని సరి పరిస్థితుల్లో,గత్యంతరం లేక అక్కడ వుంటారు కానీ
పిల్లలు మాకొద్దు అని వదిలేసి,మాకు ఒంటరితనం కావాలి అని తల్లిదండ్రులు కోరుకోరని నా అభిప్రాయం.


  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు..

భారత దేశ స్వాతంత్ర్యానికి శ్రమించిన అమరవీరులకు,
భారత దేశ శాంతి భద్రతలను తమ ప్రాణాలకు కూడా తెగించి కాపాడుతున్న భారతదేశ సైన్యానికి,
ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.



వందే
మాతరం


  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

సంక్రాంతి శుభాకాంక్షలు


వేదాలు మనకు అందించిన మహాప్రసాదం పండుగలు. పండుగలే మన సంస్కృతికి ప్రాణం.
ప్రతిపండుగ లో అర్ధం పరమార్దం దాగి ఉన్నాయి. ఎన్నో ఆధ్యాత్మిక రహస్యాలు పండుగలలో
దాగి ఉన్నాయి.పండుగలలో మకర సంక్రాంతి ప్రత్యేకత వేరు. పట్టణాల కన్నా పల్లె లోగిళ్ళలోనే
సంక్రాంతి శోభను ఆస్వాదించాల్సిందే.



సంక్రాంతి పండుగ వాతావరణం ధనుర్మాసం లోనే వచ్చేస్తుంది. కళ్ళాపులు చల్లి రంగురంగుల
ముగ్గులు వేసి,ఆవు పేడతో
గొబ్బెమ్మలు పెట్టటంతో పండుగ మొదలవుతుంది.సూర్యుడు మకరరాశి
లో ప్రవేశించినప్పుడు సంక్రాంతి. పండుగను మనము మూడు రోజులు జరుపుకుంటాము.
మొదటి రోజు భోగి. రెండు సంక్రాంతి,మూడు కనుమ.భోగి అంటే సకల భోగాలను ఇచ్చేది అని అర్ధం.

రోజున వేసే భోగి మంటలు సకల భాగ్యాలని కలిగిస్తాయని నానుడి.



మాసం లో వచ్చే రేగి పండ్లని భోగి పళ్ళు అంటారు. సకలసౌభాగ్యాలు కలగాలని దీవిస్తూ
వీటిని చిన్నపిల్లల తలలపై పోస్తారు.రెండవ రోజు సంక్రాంతి. రోజున దాన ధర్మాలు చేస్తే మంచిది
అని చెపుతారు.మూడవ రోజు కనుమ.ఇది రైతులు బాగా జరుపు కుంటారు.
వారిళ్ళలోని వ్యవసాయానికి ఉపయోగించే
పశువులను బాగా అలంకరిస్తారు.
రోజున రైతుల ఇళ్ళు పాడి పంటలతో నిండి కళకళలాడుతూ వుంటాయి.



కనుమ నాడు కాకి కూడా కదలదు అని సామెత. మూడు రోజుల పండుగను రైతులు,
ఉద్యోగస్తులు,వ్యాపారులు,చిన్న పెద్ద,తేడ లేకుండా ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటారు.
కోడి పందాలు, గంగిరెద్దులు ,హరిదాసులు,ప్రత్యెక ఆకర్షణ.
చిన్న పిల్లలు మొదలుకొని
పెద్దవారు కూడా పెద్ద పెద్ద ముగ్గులు వేయటం నెల ప్రత్యేకత.

ఇంకా అసలైన ప్రత్యేకత ,కొత్త గా పెళ్ళైన అల్లుళ్ళు ,కూతుర్లు పుట్టింటికి రావటం.
అక్కడ జరిగే సంబరాలు,అల్లుడిగారికి చేసే రాజమర్యాదలు.
ఇవన్నీ ప్రతిఒక్కరు అనుభవించే ఉంటారు. దీని గురించి ప్రత్యకంగా చెప్పనవసరం లేదు..
ఇన్ని ప్రత్యేకతలతో వచ్చే సంక్రాంతి కి స్వగతం పలుకుతూ బంధువులకి,స్నేహితులకి,
బ్లాగ్ మిత్రులకు,నా కుటుంబంలోని అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు..

భోగి మంటలు,రేగిపండ్లు,గాలిపటాలు
ముగ్గులపై గొబ్బెమ్మలు
అరిసెలు,చక్రాలు
చుట్టాలు,స్నేహితుల
కలకలలు ... కిలకిలలతో
సంక్రాంతి శుభాకాంక్షలు.

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

Yeh raat bheegi bheegi ... నాకు ఇష్టమైన హిందీ పాటలు

ఇంట్లో నానతో కలిసి నేనొక్కదాన్నే హిందీ సినిమాలు చూసే దాన్ని.
మా అక్కవాళ్ళు,అన్నయ్య అందరు మాకు హిందీ సినిమాలు అంత ఇష్టం లేదు అనే వాళ్ళు.
అప్పుడు నాన్న నన్ను రమ్మని తీసుకెళ్ళేవారు.
ఇక్కడ నేను పోస్ట్ చేసిన పాటలన్నీ మా నానతో కలిసి చూసిన సినిమాల్లో పాటలే.
పాటలని చిన్న సౌండ్ తో వినటం నాకు చాలా ఇష్టం.
ఇప్పటి హీరోయిన్ లకి ఉన్నంత మేకప్ లు లేకపోయినా అప్పటి హీరోయిన్లు సహజమైన అందంతో
చాలా బాగుండె వాళ్ళు.


Pyar Hua Ikarar Hua Hai




Lag Ja Gale Ke Phir
Yeh Haseen Raat Ho Na Ho




Yeh raat bheegi bheegi
Choori Choori




Aaja Sanam Madhur
Chandni Mein Hum




  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...