ఎన్నో సంతోషకరమైన విషయాలను మా కుటుంబంలోకి తీసుకువచ్చిన 2011 కి ఇంకొన్ని గంటల్లో వీడ్కోలు చెప్పబోతు 2012 కు స్వాగతం చెబుతూ మరెన్నో సంతోషకర సంగతులను ఆహ్వానిస్తూ మా కుటుంబం అంతటికి మంచి విజయాలు అందించాలని కోరుకుంటున్నాను..మా బందువులకు,మిత్రులకు నూతన సంవత్సర శుభాకాంక్షలతో..
నూతన సంవత్సర శుభాకాంక్షలు..
ఎన్నో సంతోషకరమైన విషయాలను మా కుటుంబంలోకి తీసుకువచ్చిన 2011 కి ఇంకొన్ని గంటల్లో వీడ్కోలు చెప్పబోతు 2012 కు స్వాగతం చెబుతూ మరెన్నో సంతోషకర సంగతులను ఆహ్వానిస్తూ మా కుటుంబం అంతటికి మంచి విజయాలు అందించాలని కోరుకుంటున్నాను..మా బందువులకు,మిత్రులకు నూతన సంవత్సర శుభాకాంక్షలతో..
శుభప్రదమైన కుంకుమబొట్టు ...
కనుబొమల నడుమ ఎర్రని బొట్టు పెట్టుకోవటం మన హైందవ సంప్రదాయం.
ఇంటికి వచ్చిన ఎ ముత్తైదువకైనా వెళ్ళేటప్పుడు బొట్టు పెట్టి పంపించటం మన ఆచారం.
బారతీయ మహిళా వివాహిత స్త్రీని ఆమె ధరించే బొట్టు,నగలు,వస్త్రధారణని బట్టి తెలుసుకొనగలుగుతాము..
ఆమె నుదుటిన పెట్టుకునే ఎర్రని కుంకుమ ఆమె వైవాహిక స్థితిని ప్రతిబింబిస్తుంది.
బొట్టు శక్తి స్వరూపంగా మన హైందవ సంప్రదాయంలో ఒక స్థానం వుంది . స్త్రీ నుదుటిన ఉన్నబొట్టు ఆమె భర్త కు
అన్ని విషయాలలో విజయాన్ని కలిగిస్తుందని ,అతడిని కాపాడుతుందని పురాణ కాలాల నుంచి ఉన్న నమ్మకము. మనము పెట్టుకున్న ఎర్రనికుంకుమ మనల్ని దుష్టశక్తుల నుంచి దరిద్రం నుంచి కాపాడుతుందని మన పూర్వీకుల ప్రగాఢ నమ్మకం.
పాపిట ధరించే కుంకుమ తో స్త్రీని వివాహితురాలి గా గుర్తించ గలము.
ఎర్రని రంగు చాల శుభప్రదమైనదిగా భావిస్తాము. అందుకనే కుంకుమని ముత్తైదు స్త్రీ నుదుటి పై,
పాపిటి పైన పెట్టుకుంటాము.
గుండ్రటి బొట్టు సతి పార్వతి దేవి ల సంకేతము..అది మనకు సిరిసంపదలు కలిగిస్తుంది.
మన కుటుంబ సంక్షేమాన్ని,సంతానాన్ని కాపాడుతుందని మన పూర్వీకుల నమ్మకం.
దానిని మనం ఆచరిస్తున్నాము.
చిన్నపిల్లలు,పెళ్లి కానిపిల్లలు ఇప్పటి ఫాషన్ ప్రకారం రకరకాల స్టిక్కర్స్ పెట్టుకున్నా
వివాహితులు మాత్రం ఎర్రని కుంకుమ ధరించటమే బాగుంటుందని నా అభిప్రాయం..
ధనమేరా అన్నిటికీ మూలం...
ముందుగ అన్నయ్యది,రెండో అక్క ముంత నిండేవి. ఇది గమనించిన మా చెల్లి రాత్రి మేమంతా నిద్ర పోగానేతను లేచి మా ముంతలలోని డబ్బును పిన్నులతో తీసి, తన ముంతలో వేసుకునేది.ఆడబ్బు తో మేము మావూరి తిరునాళ్ళలో మంచి బొమ్మలు ఇంకా మాకు అవసర మైనవి కొనుక్కునేవాళ్లము .మా అమ్మ ఎంతో పొదుపుగా వుంది కాబట్టే మేము ఐదుగురు ఆడపిల్లలమైనా అందరికీ కట్న కానుకలిచ్చిచాలా బాగా తన బాధ్యతను పూర్తిచేసుకుంది.. ఈ విషయంలో అమ్మని అనుసరించాలి అని అప్పుడే నిర్ణయించుకున్నాను..
ఈ అలవాటు మా ఇంటి లో కుడా నేను కొనసాగించాను. మా అమ్ములు,బాచి,స్వీటీ లతో వాళ్లకి ఇచ్చినడబ్బుల్లోనే కొంత దాచటం నేర్పి,ముంతల్లో వేసేలా అలవాటు చేసాను..
ఇంట్లో ఖర్చుకు మా వారు ఇచ్చిన డబ్బును కూడా జాగ్రత్తగా వాడి మిగిలిన డబ్బును పోస్ట్ ఆఫీస్ లోRD కట్టేదాన్ని మా నలుగురి పేరు మీద.RD టైం అయిపోగానే దాన్ని మళ్ళీ రెన్యువల్ చేయించేదాన్ని..
మేము ఒక స్థలం కొన్నాము. దానికి కొంత డబ్బు తగ్గింది. మాకు పొలాలు మీద కవులు డబ్బు వస్తుంది,కాని ఆ డబ్బు రావటానికి ఇంకా టైం ఉంది. రిజిస్ట్రేషన్ టైం దగ్గర పడుతుందని మావారు కంగారు పడసాగారు.నేను ఇది గమనించి పిల్లల RD డబ్బు ఇమ్మంటారా అని అడిగాను..నన్ను చూసి నవ్వి డబ్బులు కావలిసినది ఇంటి బొమ్మ కోసం కాదు ఇంటికోసం అన్నారు.పోస్ట్ ఆఫీసు మా ఇంటికి చాల దగ్గిర. మావారు బైటకి వెళ్ళిన తర్వాత నేను వెళ్లి డబ్బులు డ్రా చేసాను.మరుసటిరోజున మా వారు వాళ్ళ అన్నయ్య దగ్గరికి బయలుదేరుతుంటే నేను డ్రా చేసిన డబ్బు తీసుకెళ్ళిఇచ్చాను.
ఆ డబ్బు చూసి మీ అమ్మని అడిగావా,అన్నయ్యని అడిగావా అని అన్నారు.అప్పుడు నేను పిల్లల పోస్ట్ ఆఫీస్ RD డబ్బులివి.అని ఆ కాగితాలు చూపించాను..ఆ విధంగా మా ఇంటి స్థలం రిజిస్ట్రేషన్ పూర్తి అయ్యింది..అప్పుడప్పుడు మాటల సందర్భంలో మా వారు పిల్లలతో అమ్మలాగా పొదుపు నేర్చుకోండి అంటుంటారు..స్థలం కొనేటప్పుడు నేను చేసిన హెల్ప్ గుర్తు చేసుకుని సంతోషిస్తారు..
నీ కంటిచూపు నాకు ఉషోదయం..
సూరీడు కిరణాలు భూమిని వీక్షిస్తుంటే వసుధ తన పచ్చని పరువాన్ని దాచుకుంటుంది.
చల్లని గాలిలో తేలియాడుతూ ఓ కమ్మని గీతం నా చెవిన పడింది.
కనులు కనులతో కలపడితే ఆ కలలకు పేరేమి?
నా సూరీడు కిరణాల కోసం నా కనులు వెతికాయి. భగవద్యానం చేసుకుని ఆఫీసు కు సిద్దమవుతున్నారు.
ఏమండి !మీ భోజనం సిద్దం లంచ్ బాక్స్ ఇస్తూ అన్నాను.
నవ్వుతు చూస్తారని ఆశపడ్డాను ఆ గీతంలోని కలలు కోరుకుంటూ .
వినినట్టు లేరు .హడావిడిగా ఆఫీసు ని తలచుకుంటూ బండి మీద దూసుకుపోయారు..
నా కనులు చెమ్మగిల్లాయి..
సాయంత్రం తప్పక చూస్తారులే అని చెప్పా నా కళ్ళకి.వేచి ఉన్న సాయంత్రం రానే వచ్చింది.
సూరీడు రాత్రికి రమ్మని భూమికి కబురిచ్చి వెళ్ళాడు.తన వేడి వాడి చూపులతో తనువంతా తరచి మరీ.
నా సూరీడు అలసి సొలసి చేరారు ఇంటికి.తనువు అలసింది కాని మనసు కాదు కదా!
నా ఎదురు చూపులు కాస్త కలబడాలని సిద్ధమయినాయి.
కాని T.V ..ముందు కుర్చుని తన కళ్ళని T.V..కి సమర్పించినట్టున్నారు..
భోజనం కుడా T.V చూస్తూనే ముగించారు.
ప్చ్!రాత్రికి దొరుకుతారులే !నా కళ్ళు మెరిసాయి. అప్పుడు కూడా నిరాశే ఎదురైనది.
లైట్లు ఆర్పి వచ్చి నా మీదకి దూకారు.
ఆయన కళ్ళ కోసం వెదికాయి నా కళ్ళు
ఆ కలల కోసం,కలబాడటం కోసం...ఆ చిమ్మ చీకట్లో ఆయన స్పర్స దొరికిందే కాని ఆయన కనులు దొరకలేదు.
నా కళ్ళు కన్నీరయ్యాయి..
నీ కంటి చూపు చాలునయ్యా శ్రీవారు!
ఆభాగ్యం ఇచ్చి భాగ్యవతి ని చేయవయ్య భర్తగారు!
నా కనులు కుడా చెదిరిన కలతతో మూతపడ్డాయి మరో ఉషోదయం కోసం!
మంచి శుభారంభం కోసం !
నా సూరీడి కిరణాల కోసం !
ఈ చిన్ని కవితలో భర్త కంటిచూపు కోసం తపన పడే ఓ ఇల్లాలి ఆవేదన కనిపిస్తుంది
ఇలాంటి భార్యలు లోకంలో ఎంతమందో.నేటి ఉరుకుల పరుగుల జీవితాల్లో ఉదయాన్నే లేచిన దగ్గరనుండి
బిజీ బిజీగా వుంటూ ఆఫీసుకెళ్ళి తిరిగి ఈ ట్రాఫిక్ పద్మవ్యూహాలని దాటుకొని ఇంటికొచ్చేసరికి
సర్వ శక్తులు ఉడిగి..రాత్రికి ఇంటికి వచ్చాక కూడా కనీసం మాట్లాడుకునే ఓపిక లేకపోయినా...
ఆ కాస్త టైం కూడా టీవీలకి,కంప్యూటర్లకి అప్పగించి నిద్ర పోయే వాళ్ళు ఎంతమందో.
ఇంక ఎక్కడ కనులు కనులతో కలబడితే ఆ కలలకు పేరేమి???
ఈ కవిత "జి.వసంత - రాజమండ్రి" గారిచే రచించ బడినది.నాకు చాల నచ్చిన కవిత ఇది .
రచయిత్రి గారికి థాంక్స్....
నా అభిమాన రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి
నాకు నవలలు చదవటం ,సేకరించటం హాబీ .నేను చదువుకునే టైం లో సెలవులు వస్తే
మా పెద్దనాన్న కూతురు వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని .
మా అక్కకి కూడా నాలాగే నవల్స్ అంటే చాలా ఇష్టం..మా అక్క ఎమెస్కో బుక్ క్లబ్ లో మెంబర్.
అక్కా వాళ్ళ ఇంట్లో నవల్స్ పెద్ద పెద్ద అలమరల్లో పెట్టి ఉండేవి .అక్కదగ్గర ఎక్కువగా
యద్దనపూడి సులోచనారాణి , కోడూరి కౌసల్యాదేవి, యండమూరి వీరేంద్రనాథ్ గారి నవల్స్ ఉండేవి
నేను వెళ్ళిన దగ్గరి నుండి మరలా ఇంటికి వచ్చేదాకా అవే చదువుకుంటూ వుండేదాన్ని...
ఆవిధంగా నాకు నవల్స్ మీద ఇష్టం ఏర్పడింది..
ఆవిధంగా మొదలైన నా పఠనాసక్తి నా పెళ్లి అయిన తరువాత కూడా కొనసాగింది..
నేను కూడా ఎమెస్కో లో లైఫ్ టైం మెంబర్ ని..
తరువాత నా సొంత లైబ్రరీ ఏర్పాటు చేసుకున్నాను. నా దగ్గిర ఇపుడు
యద్దనపూడి ,యండమూరి,కోడూరి కౌసల్య కొమ్మనాపల్లి గణపతిరావు,బలభద్ర పాత్రుని రమణి,
వంశీ,మీరా లక్ష్మి , ఇంకా నాకు నచ్చిన చాలా మంది రచయితల పుస్తకాలు,
ఎమెస్కో వారు నెలనెలా ప్రచురించే కొత్త రచయితల పుస్తకాలు నా సేకరణలో వున్నాయి..
యద్దనపూడి రచనలంటే మా ఇంట్లో అమ్ములుకి, నాకు చాలా ఇష్టం.
ఆవిడ రచనలు చదువుతున్నంత సేపు ఆ పాత్రల్లో, పరిస్థితుల్లో లీనమైపోతాము..
ఆవిడ రచనలో ఒక మద్య తరగతి అమ్మాయి తన వ్యకిత్త్వం ,ఆత్మవిశ్వాసం,
హుందాతనంతో ,ఎంతటి కోటీశ్వరుడైన హీరో అయినా ఆ నాయికను ఇష్టపడి ప్రేమించే విధంగా రాస్తారు.
ఆవిడ రాసిన ఋతువులు నవ్వాయి,జీవనతరంగాలు,కీర్తికిరీటాలు,మీనా,శ్వేతగులాబి,
సెక్రటరి,ఆత్మీయులు ఇలా ఇవేమిటి ఎన్నో ఆవిడ నవల్స్ అంటే నాకు చాల పిచ్చి అనే చెప్పాలి.
ఎంతైనా ఆవిడ నవల్స్ లో లాగా తమని తాము అమ్మాయిలు ఊహించుకునే టైంలో అమ్మాయినే కదా నేను కూడా
నేను ఆవిడ నవల్స్ చాలావరకు సేకరించాను.ప్రతి పెళ్లీడుకొచ్చిన అమ్మాయి తనకు కాబోయే జీవితభాగస్వామి
ఆవిడ నవలా నాయకుడి లాగా వుండాలని కోరుకునే వాళ్ళంటే అతిశయోక్తి కాదు..
ఆవిడ రచనలు చదువుతుంటే మనకు తెలియకుండానే మన పెదాల మీదకు చిరునవ్వు వస్తుంది
కొన్ని సన్నివేశాల వర్ణనలో.. నవల్స్ లో ఇంటివర్ణన,ప్రకృతి వర్ణన కళ్ళకు కట్టినట్లుగా ఉంటుది
ప్రతి నోవెల్ లో హీరోకి,హీరోయిన్ కి వివాదం కానీ చివరికి హీరొయిన్ నే గెలిపిస్తుంది.
ఆవిడ రాసిన రచనలు కొన్ని సినిమాలుగా వచ్చాయి...
అందులో మీనా,జీవన తరంగాలు,సెక్రటరీ,ఆత్మీయులు,రాధాకృష్ణ,అగ్నిపూలు,ఆరాధన
నాకు చాలా ఇష్టమైనవి.
ఈ సినిమాల CD లు నా CD ల కలెక్షన్ లో ఉన్నాయి ...
ఇంకా నాకు చాలా ఇష్టమైన నవల "ఈ దేశం మాకేమిచ్చింది"
ఆవిడ నవల్స్ ఇది ఇష్టం ఇది ఇష్టం లేదు అని చెప్పలేను..
కొండ ఎంత పెద్దదైనా అద్దంలో చిన్నగా కనిపించినట్లు ఆవిడ గురించి ఎంత వర్ణించినా ఎంత చెప్పుకున్న తక్కువే..
ఇవీ నా జీవనగమనంలో నా అభిమాన రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి గారి ముచ్చట్లు..
పేగుబంధం
నీవు మొదటి సారి గర్భాన కదిలినప్పుడు పరమానందం కలిగింది,
నన్ను అమ్మను చేస్తున్నావని
నీవు వూపిరాడనీయకుండా కదులుతూ హడావుడి చేస్తుంటే ,
ఉత్సాహం కనిపించింది..హుషారైన వాడివని
నన్ను చీల్చుకుని ఈ లోకంలోకి వచ్చాక మమకారం పొంగింది
నా ప్రతిరూపానివని
నా రక్తాన్ని పాలుగా తాగుతుంటే,బోలెడంత ఆశ కలిగింది
అందరికంటే బలవంతుడివి కావాలని
తప్పటడుగులు వేస్తూ ఇల్లంతా తిరుగుతూ ఉంటే,
తట్టుకోలేనంత ఆనందం కలిగింది..
నీ కాళ్ళ మీద నీవు నిలబడగలవని..
ఆ అడుగుల్తోనే నాకు దూరమైతే ఆశీర్వదించాలనిపించింది
గొప్పవాడివి కావాలని
జీవన ఒత్తిడిలో పడి నన్ను మరిచిపోతే,కొండంత ధైర్యం వచ్చింది
నేను లేకపోయినా బ్రతకగలవని
ప్రాణం పోయేటప్పుడు కంట తడి పెట్టనందుకు తృప్తిగా ఉంది
నీకు తట్టుకునే శక్తి వుందని
ఇప్పుడే బాధగా వుంది.అందరు నేను చనిపోయానని ఏడుస్తూ ఉంటే
నన్ను కాల్చేటప్పుడు నీ చేయి కాలుతుందేమోనని
సాక్షి ఫండే లో లవ్ అనే శీర్షికలో ప్రచురితమైన, "జి.ఆనంద్" గారు రాసిన
ఈ కవిత నాకు చాలా నచ్చింది.
తల్లిప్రేమ గురించి రచయిత చాలా చక్కగా వర్ణించారు..
నా బంగారు తల్లి.
ప్రతి సం. డిసెంబర్ 1 అర్దరాత్రి నుంచి 2 వ తేది ఉదయం వరకు ఎంతో ఆసక్తిగా ,
తెల్లవారుజాము 4 నుంచే మా బంధువుల నుంచి,ఫ్రెండ్స్ దగ్గరి నుంచి ఫోన్స్ ,మెసేజెస్..
మా పిల్లలు అందరు తనకు చెపుతున్న గ్రీటింగ్స్ తో మాకు తెల్లవారినది..
తలంటు పోసుకుని,కొత్త బట్టలు కట్టుకొని ,పూజచేసుకొని రాగానే మేమందరమూ స్వీట్ పెట్టి హ్యాపీ బర్త్డే
చెప్పటంతో తన పుట్టిన రోజు మొదలైంది..
ఎప్పటిలాగానే మావారు గుడికి వెళ్లి అమ్ములు పేరు మీద అర్చన ,పూజలు చేయించి, ప్రసాదంతో ఇంటికొచ్చారు..
ఇంట్లో సందడి మొదలైనది. తనకి ఇష్టమైన వంటలతో భోజనమయ్యింది..
ఊరినుంచి మాచిన్న పాప , చిన్న అల్లుడుగారు వచ్చారు..
ఇల్లంతా ప్రతి సంవత్సరంలాగానే పండుగ వాతావరణం ఏర్పడినది.
సాయంత్రం డాబా మీద కేకు కటింగ్ ఏర్పాట్లు చేశాము..
అమ్ములు ఫ్రెండ్స్, చుట్టాలు చిన్నపిల్లల సందడి మొదలయ్యింది...
అమ్ములు ,ఫ్రెండ్స్,చుట్టాలు,చిన్నపిల్లల మధ్య చిరునవ్వుతో కేక్ కట్ చేసింది.
పిల్లలు,పెద్దలుతో కలసిపోయి తిరుగుతున్న నా బంగారుతల్లి ని చూస్తుంటే
తనని నేను కడుపుతో ఉన్నప్పుడు ...తను మొదట కదిలినప్పుడు నేను అమ్మ అవుతున్నానన్నఆనందం
లోకంలోకి వచినపుడు నా ప్రతిరూపన్ని చూసి కలిగిన ఆనందం ఈ రోజున కూడా అదే ఆనందం.
తను మా ఇంటి మహాలక్ష్మి . తమ్ముడికి , చెల్లికి బంగారు అక్క ,బంధువులందరికీ మంచి అమ్మాయి...
ఆ బంగారు తల్లే మా అమ్ములు, తను ఇంటికి మహాలక్ష్మి కావాలని ,తను బంగారుతల్లి కావాలని ,
జీవితంలో తను కన్న కలలన్ని నెరవేరాలని ,జీవితం నందనవనం కావాలని ,
దీర్ఘాయుష్షుతో పచ్చగా తన జీవితం నిండునూరేళ్ళు విలసిల్లాలని దీవిస్తున్నాను..
వీరయ్య - కోటేశ్వరి
ఒక రోజు నేను స్కూల్ నుంచి వచ్చే సరికి మా రెండో ఇంట్లో నుంచి సందడి వినిపించింది .
మా అమ్మను ఎవరు అని అడిగాను. మన ఇంటిలోకి అద్దెకి వచ్చారు అని చెప్పింది.
ఉదయాన్నే నేను స్కూల్ కెళ్లాలని బయటికి వచ్చినప్పుడు మా ఇంటి ముందు ఒక సైకిల్ దాని దగ్గర ఒకతను.
మాఇంట్లో కి అద్దెకి వచ్చింది వీళ్ళేనేమో అనుకోని స్కూల్ కి వెళ్లాను .
రీసెస్ పిరియడ్ లో స్కూల్ బయటి కొచ్చిన నేను అక్కడ k.c.p ఫాక్టరీ వర్కర్స్ కోసం కట్టిస్తున్న
ఇండ్ల దగ్గర మా ఇంట్లో రెంట్ కొచ్చినతను... అక్కడి వర్కర్స్ కి సూచనలు ఇస్తున్నారు .
నన్ను చూసి ఈ స్కూల్ లోన నీవు చదువు కొనేది అని అడిగారు.
నేను చాల తొందరగా ఇంటి కొచ్చి మా అమ్మకు ఈ విషయం చెప్పాను.
అవును అతను సివిల్ ఇంజినీర్ ఇక్కడి సిమెంట్ ఫాక్టరీలో ..మీ స్కూల్ దగ్గిరే అని చెప్పింది.
ఇంక ఆయన భార్య పేరు కోటేశ్వరి . చాల అందంగా ఉండేది. మెడ నిండా నగలు,
చేతులకు బంగారు గాజులతో చాల బాగుండేది.
చాల తొందరలోనే వాళ్ళతో మాకు చనువు ఏర్పడింది. మేము వాళ్ళని అన్నయ్య ,వదినా అని పిలిచే వాళ్లము..
వాళ్ళు ఇంగ్లీష్ పేపర్,మేము తెలుగు పేపర్ తెప్పించే వాళ్ళం.
అది చూచి చదువుకునే పిల్లలు ఇంగ్లీష్ పేపర్ చదవాలి అని చెప్పి వాళ్ళ పేపర్ మాకిచ్చేవాళ్ళు.
మధ్యాహ్నం పూట అమ్మ ,పెద్ద అక్క ,మా అన్నయ్య అందరితో కలసి వదిన అష్టా చెమ్మా ఆడేవాళ్ళు.
అన్నయ్య నన్ను సైకిల్ మీద స్కూల్ కి తీసుకెళ్ళేవారు.
వాళ్ళు మాతో చాలా బాగా కలసి పొయ్యారు. కొన్నాళ్ళకి ఆ అన్నయ్య కి గాజువాక స్టీల్ ప్లాంట్ లో
జాబు వచ్చి వెళ్ళిపోయారు. వెళ్ళినతరువాత చాల రోజులు లెటర్స్ రాసేవాళ్ళు.
ఒకసారి నాన్న అన్నయ్య వెళ్లి వచ్చారు. ఇప్పటికి అన్నయ్య రిటైర్ అయ్యి ఉండొచ్చు ...
ఎంత మంది పిల్లలో ఎలా వున్నారో??
మంచి వాళ్ళని ఎన్ని సంవత్సరాలు అయినా మరచి పోలేము.
ఆ అన్నయ్య పేరు వీరయ్య వదిన పేరు కోటేశ్వరి
నాకు నచ్చిన కధ...నాన్న ఎప్పుడొస్తారు?
ఈ రోజు ఆదివారం అవటాన కొంచెం లేట్ గానే లేచాము..
టిఫిన్,కాఫీ పూర్తి చేసి పేపర్ తిరగేయటం మొదలు పెట్టాను.
సాక్షి ఆదివారం ఫన్ డే బుక్ లో ఒక స్టొరీ నా గుండెను కదిలించివేసినది.
ఇది పిల్లల తండ్రి చాట్ బందర్ దగ్గిర బాంబు బ్లాస్ట్ లో చనిపొతే ఆభార్య
ఆ దుఖాన్ని భరిస్తూ ఈ విషయాన్నీ తన పిల్లలకు ఎలా చెప్పాలో అర్ధమవక
తల్లి పడే బాధను కళ్ళకు కటినట్టుగా చాల బాగా రాశారు.
ఈ కధ చదివి చాల సేపటివరకు నాకు బాధ వేసినది .
చివరిలో ఒక వాక్యం హృదయాన్ని చాల బాదకు గురిచేసినది.
"బయట నల్లగా చీకటి ....పొరలు పొరలు గా దుఖం లాగా నగరం లోని మల్టీ స్టోరీడ్ అపార్ట్ మెంట్లో
మినుకుమనే దీపాలు ..ఎవరి జీవితాలూ వారివి అంతే...ఇంకేమి లేదు. "
నిజంగా గోకుల్ చాట్ బాంబు బ్లాస్ట్ సంఘటనలో ఎందఱో తల్లిపిల్లలు అన్నదమ్ములు ,అక్కాచెల్లెలు ,
భర్తలు పోయిన వాళ్ళు భార్యలు పోయిన వాళ్ళు,అవయవాలు పోయినవాళ్ళు .
వీళ్ళందరూ ఏ అన్యాయం చేసారని ఇవన్ని అనుభవించాలి.
ఇలాంటి సంఘటనలు జరిగిన తర్వాత కొన్ని రోజులు సంతాపసభలు పెట్టడం ,
తరువాత అంతా మాములుగానే కాలచక్రం తిరిగిపోతుంది .
ఎవరో ఒకరు ఎపుడో అపుడు ....అన్నటుగా గుండెని తట్టే ఇలాటి కధలు
చదివినపుడు ఒక్క క్షణం కలుక్కుమంటుంది.
ఇంత మంచి కధను రాసిన ఆకునూరి హసన్ గారికి థాంక్స్.