
ఆడపిల్లలను ఎంత అలంకరించినా ఇంకా ఏదో ఒక లోటు కనిపిస్తూనే
ఉంటుంది.చెవులకు జూకాలు,చేతికి గాజులు,మెడలో హారం,ముక్కుకి పుడక,
(ఇది ఇప్పుడు అంతగా ఎవరూ వాడటం లేదనుకోండి).ఇన్ని ఆభరణాలను అలకరించుకున్నా ఏదో వెలితి అనిపించింది బంగారు బొమ్మకి.వెంటనే బొట్టుతో ఎంతో కళగా మెరిసిపోతున్న నుదిటి మీదకు పాపిట బిళ్ళ వచ్చి చేరగానే ...వావ్! నిజంగా బంగారు బొమ్మలానే ఉన్నానంటూ తన అందానికి తానే మురిసిపోయింది మా బంగారు బొమ్మ.
చీరలు,లంగా వోణీలు,చుడీదార్ లు ఏ డ్రెస్ అయినా పాపిట బిళ్ళ పెట్టుకుంటే చాలు అమ్మాయిలు సంప్రదాయంతోకూడిన అందంతో మెరిసిపోతుంటారు.అందుకే ఈ తరం అమ్మాయిలు కూడా పాపిట బిళ్ళను తమ ఫ్యాషన్ కలెక్షన్ లో భాగం చేసుకున్నారు...పెళ్ళిళ్ళు,సంప్రదాయ వేడుకల్లో పాపిట బిళ్ళ తప్పకుండా అలంకరించుకుంటున్నారు.
అందుకే ఒకప్పటి సాదా సీదా గా వుండే పాపిట బిళ్ళ ఇప్పటి పిల్లల ఫ్యాషన్ లకు అనుగుణంగా నవరత్నాలు,రంగు రంగుల క్రిష్టల్స్ ,రాళ్ళు,ముత్యాలు తో ఇలా రకరకాల వెరైటీ పాపిట బిళ్ళలు
అందంగా తళుకు లీనుతూ ఆకట్టుకుంటున్నాయి..
పాపిట బిళ్ళ అనేది రాజస్తానీ మహిళలకు తప్పని సరి అలంకారం.సాంప్రదాయ రాజస్థానీ "మాంగ్ టిక్కా" (పాపిట బిళ్ళ)వెడల్పు బిళ్ళలా కాకుండా గుండ్రని గంట లాగా ఉంటుంది..ముస్లిం లు కూడా పెళ్ళిళ్ళ లో పాపిట సింగారమైన ఈ పాపిట బిళ్ళను తప్పసరిగా అలంకరించుకుంటారు.
మా చిన్నప్పుడు నాకు,మా అక్కయ్యలందరికీ మా అమ్మ పాపిట బిళ్ళతో పాటూ సూర్య చంద్రులు బిళ్ళలు, పాపిట కి రెండుపక్కలా పెట్టేది.పొడవైన నల్లటి జడలో పాపిట మధ్యలో ఈ పాపట బిళ్ళ,
రెండు పక్కలా సూర్య ,చంద్రులు,జడలో చామంతి బిళ్ళ పెట్టుకుని,జడ కుప్పెలతో జడ వేసుకునే వాళ్లము.
ఈ సాంప్రదాయ అలంకారాలన్నీ ఒకప్పుడు మొరటు అని అన్నా ఈ మధ్య కాలం లో అమ్మాయిలు
లంగా వోణీ సాంప్రదాయం తో పాటూ ఈ అలంకరణలన్నిటినీ "టెంపుల్ జ్వేల్లరీ" పేరుతో అలంకరించుకోవటానికి ఆసక్తి చూపించటం ఆహ్వానించదగిన పరిణామంగా చెప్పొచ్చు..
ఆయుర్వేద శాస్త్ర రీత్యా కూడా నుదుటున పాపిట బిళ్ళను అలంకరించుకోవటం వలన
నుదురు దగ్గర నాడులు ఉత్తేజితమవుతాయట .
అందుకే మరి .... పాపిట సింగారం .... మగువల మనసైన అలంకారం...
పాపిట సింగారం.. పాపిట బిళ్ళ
మట్టి గాజులు.

నిన్న మా పిల్లలు ఇద్దరు బజారు కెళ్ళి వాళ్లకు ఇష్టమైన గాజులు,ఇంకా వాళ్లకి అవసరమైన క్రీమ్స్ ఇంకా ఏవేవో తెచ్చుకున్నారు. వాటిని అన్ని టేబుల్ మీద పరుచుకుని ఎవరెవరు ఏమి తెచ్చుకున్నారో నాకు చూపిస్తూ మాట్లాడు కుంటున్నారు. నా చిన్నతనంలో గాజులు వేయించుకోవటం ఒక పెద్ద యుద్ధమే .నేను,మా పెద్దక్క అమ్మ ఏ గాజులు వేయించుకోమంటే అవే వేయించుకొనే వాళ్ళం.మా రెండో అక్క మాత్రం గాజుల మూట మొత్తం చూపించినా ఏ గాజులు నచ్చేది కాదు. చాలాసేపు వెతికించేది.మా ఇద్దరు చెల్లెళ్ళు మాత్రం సెలెక్షన్ తొందరగానే చేసేవాళ్ళు.
మేము చిన్నపుడు గాజులు ఒక తెల్లటి గుడ్డలో మూట కట్టి దాన్ని భుజానికి రెండు వేపుల తగిలించుకుని,గాజుల వీరయ్య వచ్చే వాడు అతని కేక వినగానే ఆవీధిలోని పిల్లలు అతని వెంట కేకలు వేస్తూ బయలు దేరేవాళ్ళు.. గాజుల వీరయ్య రాగానే ఇంటిల్లపాది,వీధి ,వీధీ సందడి మొదలుతుంది.చిన్న పిల్లలు మొదలు కొని పండు ముత్తైదువుల వరకు అతని చుట్టూ చేరి తమకుసరి పోయే సైజు ,నచ్చిన రంగు వెతుక్కుంటూ చాల సందడిగా వండేది .అతని చేతులతోనే గాజులు వేయించుకుని అతనికి ,గాజుల మలారం కు నమస్కరించి అక్కడి నుంచి లేచేవాళ్ళు.. అది అప్పటిలో ఒక సాంప్రదాయం.
మహిళలు ధరిస్తున్న గాజులు వాటి ప్రాముఖ్యాన్ని ,ఆదరాన్ని కోల్పోలేదు సరి కదా వాటిలో అనేక కొత్త కొత్తరూపాలు,రంగులూ వచ్చాయి . మన జీవితంలో పెళ్లి కి ఉన్న ప్రాముఖ్యత ఎంతో గాజులకి కూడా అంత ప్రాముఖ్యత ఉన్నది .పెళ్లినాటి ఉదయం గాజులు తొడిగే కార్యక్రమం ఉంటుంది. .చేతులకు గాజులు తొడిగే సరైన సమయాన్ని పూజారి నిర్ణయిస్తారు..దీన్ని చాలా పవిత్రమైనదిగా భావిస్తాము.
పెళ్ళిలో నిండుగా గోరింటాకు పెట్టుకుని ముఖ్యంగా పెళ్ళిలో ఉపయోగించే ఎరుపు,ఆకుపచ్చ రంగుల గాజులతో మెరిసి పోయే వధువు చేతి గాజుల గలగలలు,పెళ్లి మంత్రాలు ,సన్నాయి మేళాలు కలగలసి ఆ వాతావరణము చాలా బాగుంటుంది.ఎన్ని బంగారు గాజులు వేసుకున్నా వాటి మధ్యలో కొన్నైనా మట్టి గాజులు వేసుకోవటం
ముత్తైదువులకు సౌభాగ్యాన్ని,అందాన్ని ఇస్తుంది.
శుభప్రదమైన కుంకుమబొట్టు ...
కనుబొమల నడుమ ఎర్రని బొట్టు పెట్టుకోవటం మన హైందవ సంప్రదాయం.
ఇంటికి వచ్చిన ఎ ముత్తైదువకైనా వెళ్ళేటప్పుడు బొట్టు పెట్టి పంపించటం మన ఆచారం.
బారతీయ మహిళా వివాహిత స్త్రీని ఆమె ధరించే బొట్టు,నగలు,వస్త్రధారణని బట్టి తెలుసుకొనగలుగుతాము..
ఆమె నుదుటిన పెట్టుకునే ఎర్రని కుంకుమ ఆమె వైవాహిక స్థితిని ప్రతిబింబిస్తుంది.
బొట్టు శక్తి స్వరూపంగా మన హైందవ సంప్రదాయంలో ఒక స్థానం వుంది . స్త్రీ నుదుటిన ఉన్నబొట్టు ఆమె భర్త కు
అన్ని విషయాలలో విజయాన్ని కలిగిస్తుందని ,అతడిని కాపాడుతుందని పురాణ కాలాల నుంచి ఉన్న నమ్మకము. మనము పెట్టుకున్న ఎర్రనికుంకుమ మనల్ని దుష్టశక్తుల నుంచి దరిద్రం నుంచి కాపాడుతుందని మన పూర్వీకుల ప్రగాఢ నమ్మకం.
పాపిట ధరించే కుంకుమ తో స్త్రీని వివాహితురాలి గా గుర్తించ గలము.
ఎర్రని రంగు చాల శుభప్రదమైనదిగా భావిస్తాము. అందుకనే కుంకుమని ముత్తైదు స్త్రీ నుదుటి పై,
పాపిటి పైన పెట్టుకుంటాము.
గుండ్రటి బొట్టు సతి పార్వతి దేవి ల సంకేతము..అది మనకు సిరిసంపదలు కలిగిస్తుంది.
మన కుటుంబ సంక్షేమాన్ని,సంతానాన్ని కాపాడుతుందని మన పూర్వీకుల నమ్మకం.
దానిని మనం ఆచరిస్తున్నాము.
చిన్నపిల్లలు,పెళ్లి కానిపిల్లలు ఇప్పటి ఫాషన్ ప్రకారం రకరకాల స్టిక్కర్స్ పెట్టుకున్నా
వివాహితులు మాత్రం ఎర్రని కుంకుమ ధరించటమే బాగుంటుందని నా అభిప్రాయం..







