వేసవి వస్తూనే తన ప్రతాపం చూపిస్తూ వచ్చినా ఈ మధ్య కురిసిన వర్షాల వలన వాతావరణం కొంచెం చల్లబడింది.
పిల్లలకి సెలవలు వచ్చేసాయి..ఎక్కడ చూసినా వేసవి ప్రయాణాలు,హడావుడి కనిపిస్తుంది.మా పక్కింటి పద్మా గారింట్లో అమ్మమ్మ గారింటికి వెళ్ళే హడావిడి మొదలు అయ్యింది . మా పిల్లలు పెద్దవాళ్ళు అవటంచేత మా ఇంట్లో ఆ హడావిడి లేదు ఇంకా.మా పిల్లల చిన్నతనం లో సెలవలు చాల ఆనందంగా గడిసేవి.మాచెల్లి, పిల్లలు నర్సాపురం నుంచి ఈ వేసవి సెలవలకి మా ఇంటికే వచ్చే వాళ్ళు. మాపిల్లలు,అందరితో బాగా కలసిపోయేవాళ్ళు.. వాళ్ళతో కలిసి ఎండల్లోనే ఆటలు, షికార్లు, వేసవి స్పెషల్ మామిడి కాయలు,అప్పట్లో వచ్చే పుల్ల ఐస్ లు తింటూ.. కాసేపు కొట్టుకుంటూ,తిట్టుకుంటూ, అంతలోనే మళ్ళీ కలిసిపోతూ ఇలా మే నెల అంతా మా అందరి ఇళ్ళూ చాలా సందడిగా ఉండేవి.
మా చిన్న తనంలో ఐతే మేము ఐదుగురు అక్కా చెల్లెళ్ళం ,అన్నయ్య ఎవరు ఎక్కడికి వెళ్ళాలి అని చీటీలు వేసే వాళ్ళము.. ఎక్కువగా నేను మా పెదనాన్న గారి దగ్గరికి వెళ్ళేదాన్ని. అక్కడినుంచి మా పెద్ద అన్నయ్య దగ్గరికి ,మా పెద్దనాన్న పిల్లలే అయినా అక్క,అన్నయ్యలు నన్ను సొంత చెల్లి లాగా ప్రేమగా చూసేవాళ్ళు. సెలవలన్నీ అక్కడనే గడిపేదాన్ని..పెద్దక్క,బావతో కలిసి సినిమాలు చూడటం,దగ్గరలో వున్న ప్రదేశాలు చూసి రావటం ఒక నెల వేసవి సెలవలు తెలియకుండానే అయిపోయేవి..
ఒకసారి వేసవి సెలవలకి పెద్దమ్మ అంటే అమ్మ వాళ్ళ అక్క గారి ఊరు వెళ్ళాము.. ఆ ఉరు వెళ్ళటం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే అది ఒక చిన్న పల్లెటూరు. అక్కడికి వెళ్ళటానికి సరైన రవాణా మార్గం కూడా వుండేది కాదు. కొంత దూరం బస్సు ప్రయాణం , తరువాత ఎద్దుల బండి మీద వెళ్ళాలి.. చాలా మంది కాలి నడకన ఆ ఉరు వెళతారు. అనుకున్నట్లు గానే ప్రయాణం రోజు వచ్చింది.. ముందు రోజున అమ్మ మా అందరి బాగ్స్ సర్ది పెట్టినది. నేను నిద్ర లేచే సరికి మా ఇంటి ముందు బాగా అలంకరించిన ఎద్దులతో ఉన్న బండి ఆపి ఉన్నది. దానిని చూడ గానే అన్నయ్య ,మా పెద్దక్క ,మూడో చెల్లి చాలా ఆనందంగా ప్రయానికి సిద్ధమయ్యారు.. అందరం హుషారుగా రెడీ అయిపోయి..అమ్మ,నాన్నచెప్పే జాగ్రత్తలతో బండి చాల హుషారుగా కదిలినది. దారి పొడుగునా పచ్చటి చెట్లు, తాటిముంజల కాయలతో నిండిన తాటి చెట్లు, బండి నడిపే అబ్బాయి కూనిరాగాలు ఉదయాన్నే ప్రయాణం కావటంతో వాతావరణం చాలచాల్లగా హాయిగా ఉంది. మాకు ఆ ఎద్దుల బండి ప్రయాణం చాలా సరదాగా ఉండేది.మేము మా అన్నయ్య తో ఎద్దులని ఇంకా స్పీడ్ గా పరిగెట్టించమంటే మా అన్నయ్య (పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి) ఒద్దు అవి పందెపు ఎద్దులు ,అట్లా రెచ్చగొడితే ప్రమాదం అని చెప్పాడు.
అలా మా ప్రయాణం సాగి తొందరగానే ఇల్లు చేరాము.. ఇంటి ముందు ఆగగానే పెద్దమ్మ కూతుర్లు , పక్కింటి వాళ్ళు వచ్చి టౌన్ నుంచి వచ్చిన పిల్లలం కాబట్టి అందరూ ఆసక్తిగా చూస్తూ.మమ్మలిని ఆప్యాయంగా పలకరిస్తూ ఇంట్లోకి తీసుకెళ్ళారు. మా పెద్దమ్మ వాళ్ళ ఇళ్ళు చాలా పెద్దవి.. ఇంట్లోనే పెద్ద పెద్ద ధాన్యపు గాదెలు ఉండేవి.వాటి నిండా ధాన్యాన్ని నిల్వ చేసేవారు.ఇంట్లో ఆవులు,ఎద్దులు,గేదలు ఇలా పశు సంపద అంతా వుండేది... వీటన్నిటి కోసం పెద్ద పశువుల కొష్టాలు ఉండేవి వాటి కోసం ప్రత్యేకంగా జీతగాళ్ళు వుంటారు.వీళ్ళకి జీతాలు కూడా ఆరోజుల్లో చాలా తక్కువగా ఉండేవి.
సంవత్సరానికి ఒకసారి జీతాలు,బట్టలు పెట్టేవాళ్ళు. కానీ రోజూ మాత్రం మా పెద్దమ్మ ఇంట్లోనే ఈ జీతగాళ్ళకి చల్లని మజ్జిగతో అన్నం పెట్టేది.ఇలా మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లంతా ఇంట్లో మనుషులు,పశువులు,వచ్చే పోయే బంధువుల తో
ఎప్పుడూ చాలా హడావుడిగా ఉండేది..
మేము ఇంటికి వెళ్ళగానే భోజనాల కార్యక్రమం.. మా పెద్దమ్మ మమ్మల్ని అందరినీ భోజనం కోసమే కేటాయించిన పడమటి ఇంట్లో కూర్చో పెట్టి,మా అందరికీ వడ్డించింది.భోజనం లో వాళ్ళ మోట బావి కింద చేలో పండించిన వడ్ల బియ్యం అన్నం,ముద్ద పప్పు,ఇంట్లో అప్పుడే కొత్తగా పెట్టిన రకరకాల పచ్చళ్ళు( నాకు ఇష్టమైన కొత్త మామిడి కాయ పచ్చడి)
ఇంట్లో గేదె పాల తో వచ్చిన మీగడతో ఇంట్లోనే తయారు చేసిన నెయ్యి వేసి ,చివరిలో గడ్డపెరుగుతో మళ్ళీ మళ్ళీ వడ్డిస్తూ మా భోజనం పూర్తయ్యింది..
మరుసటి రోజు తెల్లవారగానే అందరు తొందరగా రెడీ ఐతే మీ అందరిని తాటి తోపుకి తీసుకెళతాను అని మాపెద్దమ్మ కొడుకు చెప్పాడు.. మేము నలుగురం, మా పెద్దమ్మ కూతుర్లు,పెద్దన్నయ్య అందరం కలిసి వెళ్ళాము.. చాలాపెద్ద తోట అది అందులోనే సగం మామిడి తోట,సగం తాటి తోపు..ఇందులోనే ఇంటికి అవసరమైన కూరగాయలు కూడా పండించే వాళ్ళు. తాటి తోపు లోకి వెళ్లి అన్నయ్య తాటి ముంజలు కొట్టించి ఇచ్చాడు. అప్పటికప్పుడు చెట్టు మీద నుంచి కొట్టినవి కావటం తో తాటి ముంజలు చాల లేతగా తియ్యగా,అందులో చల్లటి నీళ్ళతో చాలా బాగుండేవి..
మాతోట వెంబడే చంద్రవంక అని ఒక వాగు పారుతుండేది. అందులో మా అన్నయ్య లు ఇద్దరు ఈత కొట్టేవాళ్ళు..
మాతో పాటూ వచ్చిన జీతగాళ్ళు తాటి మట్టలు, ముంజలు తీసిన తాటి కాయలతో గాన్లు లాగా బండి తయారుచేసి మమ్మలిని ఆ బండి మీద ఎక్కించుకుని లాగే వాళ్ళు. అలా సాయంత్రం దాకా ఎండా కూడా తెలియకుండా ఆ తోటల్లో ఆడుకుని,ఇంటికొచ్చేటప్పుడు కావాల్సినన్ని తాటిముంజలు, మామిడి కాయలు కోసుకొచ్చుకున్నాము..ఇలా మా సెలవలన్నీ అక్కడ చాలా సరదాగా,సంతోషంగా గడిపి మేము ఇంటికి వచ్చేదాకా మా పెద్దమ్మ పిల్లలు,పెద్దన్నయ్య మమ్మల్ని చాలా ఆప్యాయంగా చూసుకునే వాళ్ళు. ఇప్పుడు ఒక్క బయటి మనిషి భోజనానికి వస్తేనే ఎంతో ఇబ్బంది పడుతుంటారు.. కానీ ఆ రోజుల్లో ఇంట్లో ఎంతమంది ఉన్నా,ఎంతమంది బయటి వాళ్ళు వచ్చినా విసుగు లేకుండా పెద్ద పెద్ద పాత్రల్లో వండి వడ్డించే అప్పటి వాళ్ళ ఆప్యాయత ఇప్పుడు లేదు,రాదు కూడా!!
మేము ఇంటికి వచ్చేటప్పుడు మాకు చాలా తాటిముంజలు,మామిడికాయలు,వేరుశనగకాయలు ఇచ్చి పంపేవారు.మరల మమ్మలిని అదే బండిలో ఇంటికి పంపించారు. అక్కడ గడిపిన మా సెలవలన్నీ మాకు మరిచిపోలేనంత సంతోషాన్ని కలిగించాయి..అప్పుడు అనిపించింది నాకు మా అన్నయ్య ,అక్కలు సెలవలకు అక్కడికి ఎందుకు వెళదామంటారో !!. నిజంగా అప్పుడు తిరిగిన ఆ తోటలు,చేలు,చెరువు గట్లూ,ఆ ఆప్యాయతలు జన్మలో మరచిపోలేము. ఆ రోజులు మరల రావు.. అందుకే వాటిని గుర్తు చేసుకోవటం .. అదొక ఆనందం.
ఇప్పటి రోజుల్లో పిల్లలకి ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు దూరమయ్యాయి..చదువులు,ఎగ్జామ్స్,అవి అయిపోగానే పోటీ పరీక్షలు,కొద్ది టైం వుంటే కంప్యూటర్ వీడియో గేమ్స్ ఇవే ప్రస్తుతం పిల్లల వేసవి సరదాలు..మారుతున్న కాలాన్ని బట్టి అన్నీ మారాయి.. అలాగే వేసవి సరదాలు కూడా...
మా చిన్ననాటి వేసవి ...
9:55 AM |
లేబుళ్లు:
నా చిన్ననాటి జ్ఞాపకాలు
Subscribe to:
Post Comments (Atom)
0 వ్యాఖ్యలు:
Post a Comment